State Politics News(Nellore):
★కట్టుదిట్ట ఏర్పాట్లులో అధికారులు సిద్ధం
రాష్ట్ర గవర్నర్ పర్యటనకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని సంయుక్త కలెక్టర్ హరెందిర ప్రసాద్ అధికారులకు సూచించారు.
రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈనెల 24వ తేదీన జిల్లాకు రానున్న నేపథ్యంలో జిల్లాలోని వెంకటాచలం మండలం కాకుటూరు లోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో సంయుక్త కలెక్టర్ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ పర్యటనకు సంబంధించి కేటాయించిన విధులను జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. గవర్నర్ పర్యటించే విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం, నెల్లూరులోని క్యాన్సర్ ఆస్పత్రి, పోలీస్ పెరేడ్ మైదానంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. విశ్వవిద్యాలయం,నెల్లూరు పోలీస్ పెరేడ్ మైదానంలో హెలిప్యాడ్ లను పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రోటోకాల్ ప్రకారం గౌరవ మర్యాదలకు ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
గవర్నర్ పర్యటించే ప్రాంతాల్లో పారిశుద్ద్యం సజావుగా ఉండాలని, కాన్వాయ్ రాకపోకలకు, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని, వైద్య బృందాలు, అగ్ని ప్రమాదాల నివారణ యంత్రాలు సిద్ధం గా ఉంచుకోవడంతో పాటు మంచినీటి సరఫరాకు లోటులేకుండా పర్యవేక్షించాలన్నారు. స్నాతకోత్సవం కార్యక్రమం జరిగే వేదిక సుందరంగా తీర్చిదిద్దాలన్నారు.
అనంతరం విశ్వవిద్యాలయంలో ఉపకులపతి చాంబరు హెలిపాడు, స్నాతకోత్సవం జరిగే ప్రదేశం సంయుక్త కలెక్టర్ పరిశీలించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జాహ్నవి, విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఎల్ వి కె రెడ్డి, తెలుగు గంగ ప్రత్యేక కలెక్టర్ బాపి రెడ్డి, నెల్లూరు,కావలి ఆర్డిఓలు కొండయ్య, శీనానాయక్, జడ్పీ సీఈఓ శ్రీమతి వాణి, డి ఆర్ డి ఎ, డ్వామా పి డి లు సాంబశివ రెడ్డి, తిరుపతయ్య, విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ సుధాకర్, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, డి ఎమ్ హెచ్ ఓ డాక్టర్ పెంచలయ్య, డి సి హెచ్ ఎస్ డాక్టర్ రమేష్ నాథ్ తదితర అధికారులు పాల్గొన్నారు.