పారిశుద్ధ్యంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టండి - కమిషనర్ జాహ్నవి

 


State Politics News(Nellore):

 నగరంలోని ప్రధాన మార్గాలతో పాటు చిన్నపాటి వీధుల్లో కూడా పారిశుద్ధ్య నిర్వహణ ప్రణాళికాబద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, పరిశుభ్రమైన నగర వాతావరణంపై సిబ్బంది అంతా దృష్టి సారించాలని నగర పాలక సంస్థ కమిషనర్ జాహ్నవి సూచించారు. స్థానిక బాలాజీ నగర్, పొదలకూరు రోడ్డు, పొగతోట తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులను కమిషనర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పొగతోటలోని వివిధ ఆసుపత్రులనుంచి వ్యర్ధాలను సేకరించే ప్రక్రియను పరిశీలించారు. కొన్ని వీధుల్లో పారిశుధ్య నిర్వహణ సరిగా లేదని సిబ్బందిపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వర్షపు నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా జాగ్రత్తలు వహించాలని, అన్ని ప్రాంతాల్లో డ్రైను కాలువల్లో పూడికతీత పనులను చేపట్టాలని కమిషనర్ సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 14 వ డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి, పాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారులు, సచివాలయం కార్యదర్శులు, పారిశుధ్య విభాగం సిబ్బంది పాల్గొన్నారు.