State Politics News(Amaravthi):
★ మంత్రికాకాని చొరవతో తగ్గిన టమోటా ధరలు
★రైతు బజార్ లలో 70 మెట్రిక్ టన్నుల టమాటా విక్రయాలకు రంగం సిద్దం
ఈ నెల 21 శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రైతు బజార్లలో 70 మెట్రిక్ టన్నుల టమాటా విక్రయాలకు రంగం సిద్దం చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
బహిరంగ మార్కెట్ లో టమాటా ధరలను నియంత్రించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుబజార్లలో శుక్రవారం ప్రభుత్వం నిర్వహించిన టమాటా విక్రయాలకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందని మంత్రి తెలిపారు. సరసమైన ధరలకు ప్రభుత్వం విక్రయించే టమాటాలను కొనుగోలు చేసుకునేందుకు ప్రజలు రైతు బజార్ లలో పెద్ద ఎత్తున బారులు తీరారన్నారు.
ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, పల్నాడు, ఏలూరు, విశాఖపట్నం రైతు బజార్ లలో టమాటాల విక్రయాలకు ప్రజల నుండి మరింత పెద్ద ఎత్తున స్పందన కనిపించిందని మంత్రి తెలిపారు.
బహిరంగ మార్కెట్ లోని ధరల కంటే రైతు బజార్ లలో విక్రయించిన టమాటాలు తక్కువ ధరకే లభిస్తున్నాయని, కేజీ పై సుమారు రూ.15/- ల వరకు తగ్గుతున్నట్లు ఆయన తెలిపారు.
శుక్రవారం రైతుబజార్ లలో నిర్వహించిన టమాటా విక్రయాలు కొన్ని గంటల్లోనే పూర్తి అయిపోయాయన్నారు. ఈ నేపథ్యంలో శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రైతు బజార్ లలో 70 మెట్రిక్ టన్నుల టమాటా విక్రయాలకు రంగం సిద్దం చేసినట్లు మంత్రి తెలిపారు.
ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మంత్రి కాకాని తీసుకున్న ప్రత్యేక చొరవతోనే ప్రజలకు కొండెక్కిన టమోటాలను అందుబాటులోకి తీసుకోచ్చారని మంత్రిని పలు రైతు బజార్ల వద్ద ప్రజలు కొనియాడుతున్నారు.