State Politics News(Nellore):
ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు దగ్గరపడుతున్నా నెల్లూరు నగర పాలక సంస్థకు జమ కావాల్సిన పన్నులను వసూలు చేయడంలో రెవెన్యూ విభాగం సిబ్బంది అలసత్వం ప్రదర్శిస్తున్నారని, నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోని సిబ్బందికి శాఖా పరమైన చర్యలు తప్పవని కమిషనర్ దినేష్ కుమార్ హెచ్చరించారు. నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్ లు, సచివాలయం అడ్మిన్ కార్యదర్శులతో పన్నుల వసూళ్ళపై సమీక్షా సమావేశాన్ని శనివారం నిర్వహించారు. రెవెన్యూ అధికారులు, సచివాలయ అడ్మిన్ కార్యదర్శులను ఇతర సిబ్బందిని పూర్తి స్థాయిలో వినియోగించుకొని పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ ఆదేశించారు. రెవెన్యూ డివిజన్ల వారీగా అధికారుల పనితీరును కమిషనర్ విచారించి, తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. పనితీరును మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని రెవెన్యూ సిబ్బందిపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నగర ప్రజలంతా పన్ను బకాయిలను మార్చి 25 తేదీ లోపల చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. నగరవ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణ, వీధిలైట్లు, డ్రైనేజీ కాలువలు, పార్కుల నిర్మాణం వంటి వివిధ మౌలిక వసతుల కల్పనకోసం జరిగే అభివృద్ధి పనులన్నీ నగరవాసులు చెల్లిస్తున్న పన్నులతోనే సాధ్యమవుతుందని, సూచించిన సమయంలోపు ఆస్తి పన్నులను చెల్లించి వడ్డీ భారాన్ని తొలగించుకోవాలని కమిషనర్ సూచించారు. ఆస్తి పన్నుల వివరాలను ఆన్లైన్లో తెలుసుకునేందుకు "ఎన్.ఎం.సి ఫర్ యు" అనే యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలను దాని ద్వారా తెలుసుకోవచ్చని కమిషనర్ వెల్లడించారు. సమీక్షా సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, రెవెన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్ లు, అన్ని సచివాలయాల అడ్మిన్ కార్యదర్శులు, రెవెన్యూ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.