State Politics News(Nellore):
★ పలువురికి షోకాజ్ నోటీసులు
నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో రెవిన్యూ పన్నుల వసూళ్ల వేగాన్ని మరింత పెంచాలని నగర కమిషనర్ కె. దినేష్ కుమార్ సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రెవిన్యూ ఆర్ఒ, ఆర్ఐ, అడ్మిన్ సెక్రటరీలతో పన్నుల వసూళ్ల కు సంబంధించి నగర మేయర్ పొట్లూరి స్రవంతి తో కలిసి శుక్రవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సిబ్బంది తమ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. పన్నుల వసూళ్లకు సంబంధించి డిఫాల్టర్ల కు రెడ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. పన్ను బకాయిలు దీర్ఘకాలికంగా ఉన్న దుకాణాలను గుర్తించి వెంటనే సీజ్ చేయాలన్నారు. పన్ను వసూళ్లకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోని ఆర్ఐ, అడ్మిన్ కార్యదర్శులకు ఆయన షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పన్నుల వసూళ్ల పై మరింత దృష్టి సారించాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, రెవిన్యూ విభాగ ఆర్ ఓ, ఆర్ ఐ, అడ్మిన్ కార్యదర్శులు పాల్గొన్నారు.