State Politics News(Nellore)
★ సీఎం జగన్ను, జిల్లా కలెక్టర్ను కోరిన ఎంపీ ఆదాల
నెల్లూరు జిల్లాలో మమేకమై అభివృద్ధి చెందిన గూడూరు ప్రాంతాన్ని నెల్లూరు జిల్లా లోనే కొనసాగించాలని, కందుకూరును ప్రకాశం జిల్లాలోనే ఉంచాలని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి, నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకు గురువారం ఆయన లేఖలను పంపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. చిన్న జిల్లాల విభజన వల్ల సత్వర ప్రగతి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జిల్లాల విభజనలో భాగంగా కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని, గూడూరు నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు. కందుకూరు నియోజకవర్గ ప్రజలు పని మీద నెల్లూరుకు రావాలంటే 110 కిలోమీటర్ల దూరం రావాల్సి ఉంటుందని, అదే ఒంగోలు వారికి 40 కిలోమీటర్ల దూరంలో ఉండి అందుబాటులో ఉందని తెలిపారు. గూడూరు నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపడం వల్ల ఇక్కడి ప్రజలు వంద కిలోమీటర్లకు పైగా ప్రయాణించి తిరుపతికి వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. తద్వారా ఈ రెండు నియోజకవర్గాల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు.ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కందుకూరును ప్రకాశంలో, గూడూరును నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని ఎంపీ ఆదాల విజ్ఞప్తి చేశారు.