State Politics News(Nellore):
ఎందరో మహనీయుల త్యాగాలతో సాధించుకున్న స్వతంత్ర దేశ స్వేచ్ఛా సంస్కృతిని భావి తరాలకు అందించేందుకు ఉన్నత ఆదర్శాలను పాటిద్దామని నగర పాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేడుకలలో మేయర్ పొట్లూరి స్రవంతితో కలిసి పాల్గొన్నారు. ముందుగా కమిషనర్ గాంధీజీ, అంబేద్కర్ ల చిత్రపటాలకు నివాళులు అర్పించి, అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బ్రిటీష్ పరిపాలన నుంచి విముక్తి పొందిన తరువాత భారత పౌరులందరిని ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి, స్వాతంత్ర్య పోరాట ఆశయాలను నెరవేర్చడానికి, రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు. భారత రాజ్యాంగం జనవరి 26, 1950 నుంచి అమలులోకి వచ్చిందని, ఈ రోజున భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకికతత్వం, న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందారని కమిషనర్ వివరించారు. రాజ్యాంగ అమలుతో భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించిందని, ప్రతీ ఒక్క పౌరుడూ రాజ్యాంగ బద్ధుడై, బాధ్యతగా నడుచుకోవాలని కమిషనర్ సూచించారు. నగర పౌరులకోసం ఉత్తమ ప్రణాళికలతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రజలంతా నెల్లూరు నగారాభివృద్ధికి సహకరించాలని కమిషనర్ కోరారు.
అనంతరం కార్యాలయంలోని వివిధ విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి కమిషనర్ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్లు, మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.