State politics news【Nellore】:
భవిష్యత్తులో కోవిడ్ వంటి విపత్తులు వచ్చినా.., వాటిని సమర్ధవంతంగా ఎదుర్కునేలా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రమంతా 64 ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటుకు టెండర్లు పిలిచారన్నారు. నెల్లూరు జిల్లాలో 4 ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారని రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి పి.అనిల్ కుమార్ తెలిపారు. ఆదివారం నెల్లూరు నగరంలోని జిజి హెచ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ కి శంఖుస్థాపన చేసిన మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా 1 కె.ఎల్. సామర్థ్యంతో ఆక్సిజన్ ప్లాంట్ కి భూమి పూజ నిర్వహించామని, త్వరలోనే గూడూరు, కావలి, ఆత్మకూరులో కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో 10 కె.ఎల్. సామర్థ్యంతో ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఇవన్నీ పూర్తి అయితే కోవిడ్ రోగులకు ఆక్సిజన్ అవసరం అయితే వినియోగించుకుని మెరుగైన వైద్యం అందించవచ్చని తెలిపారు. జిల్లాలో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్స్ ని కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి శ మేకపాటి గౌతం రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కె.శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్ చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్ హరేంధిర ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.