State politics news【Nellore】:
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి కోవిడ్ నివారణ చర్యలను 24 గం. పర్యవేక్షిస్తున్నారని, కేంద్రం ఇతర రాష్ట్రాలతో సంప్రదించి రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు తీసుకున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని జిజిహెచ్ ఆస్పత్రిలో ఆదివారం కోటి 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న ఆక్సిజన్ ప్లాంట్ కి మంత్రి శంకుస్థాపన అనంతరం మీడియా తో మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో శ్రీసిటీలో క్రయోజెనిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. థర్డ్ వేవ్ వచ్చినా..? ఎదుర్కొనేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. విశాఖపట్నంలో ఆర్ఐఎన్ఎల్ ద్వారా నిర్మిస్తున్న వెయ్యి పడకల ఆసుపత్రిలో, మొదటి విడతలో భాగంగా ఇవాళ 200 బెడ్లు ప్రారంభించామని తెలిపారు. రాష్ట్ర ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఎంతో సహకారం అందిస్తోంది అని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే కరోనా నియంత్రణలోనూ, వ్యాక్సినేషన్ కార్యక్రమంలోనూ, ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఏపీ నెం1లో ఉందన్నారు. దేశానికి ఎక్కువ సంఖ్యలో వ్యాక్సినేషన్ డోసులు అందుబాటులోకి తీసుకురావడానికి , కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోందన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అధిక వ్యాక్సిన్ డోసులు తీసుకువస్తామన్నారు.జిజిహెచ్ లో శంకుస్థాపన చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ద్వారా గాలి నుంచి ఆక్సిజన్ ని ఉత్పత్తి చేయవచ్చని, త్వరలోనే ఆత్మకూరులో కూడా రూ. 1.55 కోట్లతో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ని నిర్మిస్తున్నామని తెలిపారు.
ఈ సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి పి. అనిల్ కుమార్, ఎమ్మెల్యే కె.శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్ చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్ శ్రీ హరేంధిర ప్రసాద్, విజయా డైరీ చైర్మన్ కె.రంగారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.