State politics news【Nellore】:
మంత్రి అనీల్ కుమార్ తమ్ముడు పోలుబోయిన అశ్విని కుమార్, అతని ముఠా పొగతోటలో మెడికల్ రాబంధుల్లా తయారై కరోనా రోగులను పీక్కు తింటున్నారని నెల్లూరు టీడీపీ సిటి ఇన్చార్జి కోటంరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అనుమతులు లేకుండా.. అర్హత లేని డాక్టర్లను నియమించుకుని... ఏడు హాస్పటల్స్ ను లీజుకు తీసుకుని కరోనా మాటున కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని మండిపడ్డారు.
బాలాజీనగర్ లో ఉండే ఆయన నివాసంలో శనివారం మీడియాతో కోటంరెడ్డి మట్లాడారు. పొగతోటలో ఏడు హాస్పటల్స్ ను మంత్రి అనీల్ తమ్ముడూ లీజుకు తీసుకుని అనుమతులు లేకుండా కరోనా రోగులకు చికిత్స ఇస్తున్నారని విమర్శించారు. రోజుకు 30 నుంచి 40వేలు వసూలు చేస్తూ.. ప్రజలను పీక్కు తింటున్నారని ఆరోపించారు. ఏడు హాస్పిటల్స్ ద్వారా రోజుకు రెండు కోట్ల రూపాయలు అక్రమంగా దోచుకుంటున్నారని ఆగ్రహంవ్యక్తం చేశారు. జిల్లాలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా సీఎం జగన్ నీరో చక్రవర్తిలాగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. దోచుకునేందుకు పేటెంట్ హక్కులు మంత్రులుకు ఇచ్చారని ఆయన మండిపడ్డారు. అశ్విని కుమార్ వంటి డాక్టర్ల వల్ల వైద్యవృత్తికే చెడ్డపేరు వస్తోందన్నారు. ఆర్ ఎంపీ డాక్టర్లకు స్టెతస్కోప్ పెట్టి.. లీజ్ కు తీసుకున్న హాస్పిటల్స్ లో వారిని నియమించారని ఆరోపించారు. కొందరు కరోనా రోగుల ప్రాణాలు కాపాడేందుకు ప్రాణాలను సైతం త్యాగం చేస్తుంటే.. మంత్రి అనీల్ అండతో అశ్విని కుమార్ వారి వద్ద నుంచి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని విమర్శించారు. కలెక్టర్ కు దమ్ము దైర్యముంటే ఆ ఏడు హాస్పటల్స్ లో తనిఖీలు చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు. వారిపై చర్యలు తీసుకోకపోతే రోడ్డుమీదకు వచ్చి ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు.