State politics news【Sarvepalli】:
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండల కేంద్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులతో పాటు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డా౹౹గురు మూర్తి కి అత్యధిక మెజారిటీ గెలిపించాలని వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధాటికి తట్టుకోలేక చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ అంటూ పలాయనం చిత్తగించాడన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సంతృప్తిగా ఉన్న ప్రజలు, జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచి, చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు సిద్ధాంతాలు లేకుండా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీని ఓడించడమే ధ్యేయంగా పని చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చినప్పటికీ లెక్కచేయకుండా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రచారం నిర్వహించుకుంటూ, తెలుగుదేశం పార్టీ పోటీ లేని చోట్ల ఇతర పార్టీలకు మద్దతు ఇస్తున్నారని విమర్శించారు.
సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు ధాన్యం దొంగల అవతారమెత్తి, రైతులను దోచుకోవడంతో జైలుపాలయ్యారని తెలిపారు.
వ్యవసాయ శాఖ మంత్రిగా పనికిరాని ఉత్తర్వులు ఇచ్చి, ప్రలోభపెట్టే ప్రయత్నం చేసి, రైతుల చేత తిరస్కరింపబడిన వ్యక్తి, రైతుల గురించి ముసలి కన్నీరు కారుస్తున్నాడని అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా రైతులను అడ్డుపెట్టుకొని, గిట్టుబాటు ధర కల్పించకుండా, నీరు-చెట్టు, రైతు రథం లాంటి కార్యక్రమాల పేరిట వందల కోట్లు ప్రజా సొమ్ము దోచుకున్నాడని తీవ్రంగా మండిపడ్డారు.
అవినీతి సంపాదన ద్వారా వచ్చిన సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేసి, అందలమెక్కాలని ఆశపడ్డ వారికి, ఘోరపరాజయం తప్పలేదన్నారు.
నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందించడంతోపాటు, కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచి 3 కోట్ల 50 లక్షల విలువైన బియ్యం, వంటనూనెను పంపిణీ చేశామన్నారు. కరోనా నేపథ్యంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా భావించి తాము పని చేస్తే ,తెలుగుదేశం నాయకులు తమకు ఎక్కడ కరోనా వస్తుందోనని ముసుగు తన్ని పడుకొని, ప్రజలను పట్టించుకోకుండా వదిలేశారని గుర్తుచేశారు. సర్వేపల్లి నియోజకవర్గాన్ని "సోమిబాబా-తెలుగు దొంగలు" అధికారాన్ని అడ్డుపెట్టుకొని, పంచభూతాలను కూడా దోపిడీ చేశారన్నారు. నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు అందరం కష్టించి పనిచేసి, అత్యధిక పోలింగ్ శాతం సాధించడంతో పాటు, తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తికి భారీ మెజారిటీ సాధించేందుకు తీవ్రంగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు, తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, అత్యధిక మెజారిటీతో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేసి, సర్వేపల్లి నియోజకవర్గాన్ని అగ్రభాగాన నిలుపుదామని ఎమ్మెల్యే కాకాని తెలిపారు.