దశాబ్దాల పాటు జగన్ రాష్ట్రాన్ని పాలించాలి: నెల్లూరు ఎంపీ ఆదాల

 


State politics news {nellore}:

 ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దశాబ్దాలపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించాలని, మరింత అభివృద్ధి పరచాలని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆకాంక్షించారు. నెల్లూరులోని జిల్లా వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో 11వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీని ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ స్థాపించి, ఎనలేని ప్రజాభిమానాన్ని చూరగొన్నారని ప్రశంసించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయని కితాబిచ్చారు. గతంలో రాజశేఖర్ రెడ్డి పాలన చూసి ఇటువంటి పాలన రాబోదని అందరూ భావించారని గుర్తు చేశారు. అయితే జగన్ మోహన్ రెడ్డి పాలన అంతకుమించి సాగుతోందని, ఇది మన అదృష్టమని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో 90 శాతానికి పైగా ఫలితాలు వచ్చాయని కితాబిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో 95 శాతానికి పైగా ఫలితాలు రాబోతున్నాయని జోస్యం చెప్పారు. అదేవిధంగా ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో కూడా గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా, ప్రతిపక్షాలు కావాలని అభాండాలు వేస్తున్నారని విమర్శించారు. ఇది సరికాదని, ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, విజయ డైరీ ఛైర్మన్ రంగారెడ్డి,మాజీ జడ్పీటీసీ సభ్యుడు వెంకట శేషయ్య, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య,జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు దాసరి భాస్కర్ గౌడ్, కోటేశ్వర్ రెడ్డి, నరసింహారావు, శ్రీనివాసులురెడ్డి, అబూబకర్, ఇగ్బాల్, అల్లాబక్షు, పాముల హరి తదితరులు పాల్గొన్నారు.