★శివరాత్రి రోజున శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనం చిరకాలం నిలిచిపోయే మంచి జ్ఞాపకం పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి
★టీటీడీ బ్రహ్మోత్సవాలు స్థాయిలో శ్రీకాళహస్తి ఆలయ అలంకరణ అద్భుతం
★శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కృషిని ప్రత్యేకంగా ప్రశంసించిన మంత్రి
చిత్తూరులో శివరాత్రి పర్వదినం సందర్భంగా తన తల్లిదండ్రులతో కలిసి వాయులింగేశ్వర స్వామి క్షేత్రాన్ని సందర్శించుకోవడం మరపురాని రోజుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బియ్యం మధుసూదన్ రెడ్డి ఆహ్వానం మేరకు శ్రీకాళహస్తీశ్వర స్వామిని, ప్రసూనాంబ అమ్మవార్లను ఈ ప్రత్యేకమైన రోజున దర్శించుకోవడం మరింత ప్రత్యేకమన్నారు. రాబోయే మరో 30 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండాలని స్వామిని కోరుకున్నట్లు మంత్రి మేకపాటి పేర్కొన్నారు. గురువారం శ్రీకాళహస్తి ఆలయాన్ని,తిరుమల క్షేత్రాన్ని మహా శివరాత్రి నాడు తన కుటుంబ సభ్యులు తో కలిసి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తాను మొదటి సారిగా శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దర్శించుకున్నట్లు మంత్రి వెల్లడించారు. టీటీడీ బ్రహ్మోత్సవాల స్థాయిలో శ్రీకాళహస్తి దేవస్థానాన్ని అత్యంత సుందరంగా అలంకరించి, తీర్చిదిద్దడం వెనుక దేవాదాయ శాఖ, జిల్లా యంత్రాంగం, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కృషిని మంత్రి గౌతమ్ రెడ్డి అభినందించారు. ఆలయంలో అడుగు పెట్టగానే మరింత అనుభూతికి లోనయ్యేవిధంగా చేసిన ఏర్పాట్ల నడుమ భక్తులు సంతోషంగా దర్శనం చేసుకుంటున్నారన్నారు. అంతకుముందు దర్శనానంతరం మంత్రి మేకపాటితో సహా ఆయన తల్లిదండ్రులకు ఆలయ ఈవో డి. పెద్దిరాజు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఘన స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో ప్రత్యేక దర్శనం చేయించడమే కాకుండా వారిని ఎమ్మెల్యే శాలువాలతో సన్మానించి,చిరు జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేకపాటి తల్లిదండ్రులు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మమణిమంజరమ్మ, సోదరుడు పృథ్వీ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కుమారుడు గిరిధర్ రెడ్డి, వైసిపి తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి , తదితర మేకపాటి కుటుంబ సభ్యులు ఈ దర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు.