ఉక్కు పరిశ్రమను కేంద్రం అమ్మాలని చూస్తే రాష్ట్రమే కొంటుంది:మంత్రి మేకపాటి



✍️వియం✍️ ప్రజా ఉద్యమంతో పుట్టిన 'విశాఖ ఉక్కు' పరిశ్రమను కేంద్రం అమ్మాలని చూస్తే రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు.శనివారం చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని  కలిసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.రాష్ట్ర విభజన హక్కు చట్టం ప్రకారం ఏపీకి కేంద్రం ఎలాగు ఒక స్టీల్ ప్లాంట్ కేటాయించాలని మంత్రి మేకపాటి అన్నారు. ఎవరికో ప్రైవేటీకరణతో కట్టబెట్టడం బదులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే  ఇవ్వమని కోరుతున్నామన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ అప్పులు కేంద్రమే భరించాలని,అప్పులు, కేటాయింపులు లెక్కబెట్టి తమకొచ్చేది తమకు ఇవ్వాల్సిందేనన్నారు.


             ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి ఉక్కు కర్మాగారంగా విశాఖ స్టీల్ ప్లాంట్ నే ఇవ్వొచ్చునని,ముఖ్యమంత్రి కి కూడా పరిశ్రమల శాఖ తరపున ఈ ప్రతిపాదనను వివరిస్తామని మేకపాటి తెలిపారు. ఏపీ ఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు రావ్వాల్సిన స్టీల్ ప్లాంట్ సహా అనేక అంశాలపై  కేంద్రంని ఎన్నిసార్లు అడిగినా స్పందించలేదన్నారు. ప్రజా ఉద్యమంతో ఏర్పాటైన ఆ ఒక్క 'ఉక్కు'ను కూడా ప్రైవేటీకరణ చేయాలనుకోవడం సమంజసం కాదని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.