రైస్ మిల్లర్స్ సమస్యల పరిష్కారానికై ఉపరాష్ట్రపతి చొరవ
• కేంద్ర ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం
• రైస్ మిల్లర్లతో చర్చించి, సమస్యను సానుకూల మార్గంలో పరిష్కరించాలని సూచన*
✍️వియం✍️ : దేశంలోని రైస్ మిల్లర్స్ గత కొంత కాలంగా ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయడు ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. ఇటీవల ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆహార మరియు ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే మరియు ఛైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ సంజీవ్ కుమార్ లను ఢిల్లీలోని తమ నివాసానికి పిలిపించిన ఉపరాష్ట్రపతి, రైస్ మిల్లర్స్ సమస్యల పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో రైస్ మిల్లర్ల ప్రధాన సమస్యలైన బియ్యం కొనుగోలు సుముఖత విధానం, తక్కువ పోషకాలు గల బియ్యం కొనుగోలు, తూనికల విధానం, పాలిష్ తగ్గించే అంశాలకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితులను ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి ఉపరాష్ట్రపతికి తెలియజేశారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఉత్పత్తి అయిన అదనపు వరి ధాన్యం సేకరణ విషయంలో, ఎఫ్.సి.ఐ. నిర్దేశించిన పరిమితి కంటే అధిక నిల్వలను పారదర్శకంగా, విశ్వసనీయమైన విధానంలో కొనుగోలు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసి, త్వరలో ఉత్తర్వులు ఇస్తామని, ఈ విషయంలో సమగ్ర సంస్కరణలు చేపడతామని, ఇందు కోసం రాష్ట్రాలతో సంప్రదిస్తున్నట్లు కార్యదర్శి, ఉపరాష్ట్రపతికి తెలియజేశారు.
అనంతరం రైస్ మిల్లర్లతో చర్చించి, వారి సమస్యలను సానుకూల మార్గంలో పరిష్కరించాలని ఉపరాష్ట్రపతి కార్యదర్శికి సూచించారు.
ఉపరాష్ట్రపతి సూచన మేరకు అదనపు ఉత్పత్తి యొక్క పూర్తి పరిమాణాన్ని కొనుగోలు చేసేందుకు ఎఫ్.సి.ఐ. కార్యదర్శి మరియు ఛైర్మన్ అంగీకారం తెలిపారు. అనంతరం రైస్ మిల్లర్స్ నేతలు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కు ధన్యవాదాలు తెలియజేసారు.ఈ సమావేశంలో ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ అసోషియేషన్ చైర్మన్ గుమ్మడి వెంకటేశ్వర రావు, అధ్యక్షులు తార్సెమ్ సియాని సహా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.