మంచినీటి సమస్యలకు ప్రత్యేక చర్యలు
- కమిషనర్ బాపిరెడ్డి
న్యూస్ ఫోర్స్,నెల్లూరు:వేసవికాలంలో మంచినీటి సమస్య ఉత్పన్నం కాకుండా నగర వ్యాప్తంగా పటిష్ట చర్యలు తీసుకుని, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కేంద్రాన్ని కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ టి. బాపిరెడ్డి పేర్కొన్నారు. కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఇంజనీరింగ్ శాఖ అధికారులతో వేసవి సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో భూగర్భజలాలు అడుగంటి పోయే సందర్భంగా తలెత్తే మంచినీటి సమస్యలను ఎదుర్కోవడానికి పటిష్టమైన ప్రణాళికలను రూపొందించామని తెలిపారు. నగరంలో మంచి నీటి సమస్యలపై స్పందించేలా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని, ఫిర్యాదు అందిన 24 గంటల్లో సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. నగర వ్యాప్తంగా ఉన్న డివైడర్లు, పార్కులలో ఉన్న పచ్చదనం హరించి పోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, మొక్కలకు నిరంతరం నీటి సరఫరా జరిగేలా ప్రత్యేక సిబ్బందిని కేటాయించామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఇంజనీరింగ్ ఎస్.ఈ ఇమామ్ మొహిద్దిన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#